కంపెనీ ఇచ్చిన ఇంట్లో ఉంటూ రూం మేట్ కోసం వెతకడం మొదలెట్టాను. ఆఫీసు లో దొరికిన ప్రతి ఒక్కడిని నాకు వచ్చీ రాని హిందీ లో "తుం , మై , రూం .. రూం .. తుం , మై .. ఒకే ??" అని అడిగేవాడిని.
ఇప్పటికీ నాకు అర్ధం కాని విషయమేమిటంటే, ఎవరన్నా నచ్చితే సరే అంటారు లేక పోతే లేదంటారు గాని వీల్లేంటి నన్ను అసహ్యించుకుంటారు ?? బహుశా వాళ్ళలో కొంత మందికి నాకు వచ్చిన హిందీ కూడా రాదనుకుంటా !!
ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కలిసాడు , కత్తి రెడ్డి!! ఓ వెబ్సైటు లో తనకి రూం మేట్ కావాలని ఫోన్ నెంబర్, ఇంటి నెంబర్, వాళ్ళ ఊళ్ళో పక్కింటి వాళ్ళ నెంబర్, తన "conduct" సర్టిఫికేట్ స్కాన్ కాపీ, వగైరా వివరాలు ఇచ్చాడు. వాళ్ళ ఊరు "STD" code ని బట్టి తెలుగు వాడని నా "detective" మెదడు కనిపెట్టేసింది.
వెంటనే ఫోన్ చేశా, "హలో , కత్తి రెడ్డి గారా అండీ ? "
"అవును, కాని నాకు క్రెడిట్ కార్డులు వద్దు!! "
"అయ్యో , నేను మీకు రూం మేట్ అయ్యి పెడదామని ఫోన్ చేశానండీ !!"
"ఓహో అలాగా , మంచిది. అలాగే అయ్యి పెట్టండి. ఇంతకి, మీ పేరు ఏంటి ? "
"నన్ను సన్నీ అంటారు. మీ రూం తాలూకు వివరాలు ఇస్తే, వస్తాను "
"రూం అంధేరీ లో ఉంది. మీరు మాత్రం సాయంత్రమే రండి. అద్దె సుమారు ఏడు వేలు అవుతుంది. "
"ఏడు వేలేనా!!! మరీ ... తలకి ఎంత పడుతుంది ? "
"నేను తల, మొండానికి కలిపే ఏడు వేలన్నాను. మొత్తం అద్దె పాతిక వేలు. ఇంతకీ మీ పేరేంటో ? "
"నా పేరు సన్నీ అండీ. "
"ఏదో నీళ్ళ సమస్య ఉంది కాబట్టి , ఈ మాత్రం తక్కువలో దొరికిందండీ. ఇంతకీ మీ పేరేంటి ?"
ఆ ప్రశ్నతో "నీ ఘజిని మొహం లో నా చెప్పు " అని అనాలనిపించింది. రూం లోకి రానిచ్చిన తరువాత మన ప్రతాపం చూపించవచ్చని ఈ విషయాన్నీ వదిలేశా.
హడావుడి గా అంధేరీ కి వెళ్లాను.కత్తి రెడ్డి రూం చూపించడం మానేసి, ముందు చుట్టుపక్కల ఏముందో చూపించడం మొదలెట్టాడు.
"ఓ పక్క , స్లం ఉంది. అప్పుడు అప్పుడు డిస్కో లు అవి జరుగుతుంటాయి. మరో పక్క స్మశానం ఉంది. పచ్చగా ఉంటుంది లెండి. స్మశానం పేరుకే గాని, మాంచి కళగా ఉంటుంది ."
"మరి హాలు, అవి ? " అని అడిగాను.
" మీరు సరిగ్గా గమనించి నట్టు లేరు. మీరు ఇంటి లోపలకి వచ్చాక రెండు అడుగులు వేశారా ? .. అక్కడితో హాలు అయ్యిపోయింది . ఇంక మిగతా ఇల్లు మీరు ఎంత వరకు చూసారో అదే. Hidden costs ఏవి లేవు !!!" అని అనేసుకొని, తను ఒక్కడే నవ్వేసుకున్నాడు.
నాకు మాత్రం ఇంటి కొలతలు చూసి ఏడవాలో నవ్వాలో అర్ధం అవ్వలేదు. ఇంత చిన్న ఇంటిని మా ఊళ్ళో పాతిక వేలకి ఏకంగా కొని పారేయొచ్చు అని మాత్రం తట్టింది.
గత్యంతరం లేక ఆ ఇంటికే వెళ్లి తగలడ్డాను. ఆ ఇంట్లో మొదటి రోజు, పక్కనున్న స్లం లో నుంచి ఏవో టపాకాయల శబ్దం వినిపించింది. కత్తి రెడ్డి ని చూసి .. "దీపావళి నా ? " అని అడిగాను. కత్తి రెడ్డి "ఎవరిదో పెళ్లి " అన్నాడు.
రెండో రోజు కూడా టపాకాయలు కాల్చారు . ఈ సారి కత్తి రెడ్డి "ఎవరిదో పండగ"అన్నాడు. మూడోరోజుకి అలవాటయ్యి పోయింది. "ఈ పాడు ఊళ్ళో, ఏమొచ్చినా టపాకాయలే" అనుకుని ఊరుకున్నాను. నాలుగో రోజు మాత్రం నిశ్శబ్దంగా ఉంది . ఎవరో పోయారు. రాత్రికి మళ్ళి గోల మొదలయ్యింది. ఏంటా అని చూస్తే ఆ పోయిన మనిషిని, పక్కనే ఉన్న స్మశానంలో పూడ్చేసి, "ceremony" జరుపుకుంటున్నారు ఈ పాడు జనం. ఇంతే కాకుండా నా జీవితం లో ఎప్పుడు చూడని వింతని చూసాను. స్మశానం లో జనాలు భోజనం కూడా చేస్తున్నారు.
ఆహా, దేవుడా నన్ను సరిగ్గా ఎక్కడికి తీసుకువచ్చావ్ తండ్రీ !!!
------------------------------