Showing posts with label prank. Show all posts
Showing posts with label prank. Show all posts

Monday, August 30, 2010

'ఎందుకిలా' నా ఖర్మ కాలిపోయింది ?

ఈ కధని అందించిన సుసు బాబు కి , సత్తి బాబుకి నా ధన్యవాదాలు. కధ లో .. 'నేను' మా సత్తి .
----------------------------

హరిగాడు ,నేనూ అప్పుడే రూంలోకి వెళ్లి , రిలాక్ష్ అవుతున్నాం. మా లంబుగాడు రూంకి వచ్చి, "నేను కొత్త నెంబర్ తీసుకున్నా!!! మీ ఫోన్ లో ఫీడ్ చేసుకోండి" అన్నాడు . వెంకటేష్ ప్రసాద్ సెంచరి, సహారాలో వరదలు, ఇలాంటి 'అవకాశాలు' చాలా అరుదుగా వస్తాయి. దీన్ని వదిలే ప్రసక్తే లేదు. అమ్మాయి లా మాట్లాడి ఎవరినన్నా 'బక్రా' చేయొచ్చని అనుకున్నాం. దీనిలో హరిగాడు దిట్ట.
అయితే , తన పరపతిని తిరుపతిలో చాటి చెప్పుకోవడానికి వెళ్లి తిరిగి వస్తున్నాడు, మా హుస్సేన్ భాయి .
"హుస్సేన్ భాయి తిరుపతి నుంచి వస్తున్నాడురా..దారిలో ఉన్నాడు" అని అన్నాను హరిగాడితో .
"అయితే భాయికే ఫోన్ చేద్దాం ..సిందు అని చెబుదాం" అన్నాడు హరి.

అప్పుడో సారి సిందు అనే అమ్మాయి గురించి ఏవో నాలుగు ముక్కలు కక్కాడు మా హుస్సేన్ భాయి. సరిగా హరిగాడికే చెప్పకూడదని, పాపం భాయి మాత్రం కల కన్నాడా? ..

ఇంకేముంది, హరిగాడు వెంటనే హుస్సేన్ భాయికి ఫోన్ చేసి , స్పీకర్ ఆన్ చేశాడు.

హరిగాడు (అమ్మాయి గొంతులో )
" హలో .. "
హుస్సేన్ భాయి : " హలో ఎవరు ?"
"హలో , నేను హరి చిచి సిందుని మాట్లాడుతున్నా!!! "
" హలో ఎవరు ?? " (హుస్సేన్ భాయి కి సరిగ్గా వినపడాల్సిన విషయం వినపడలేదు పాపం.)
"హలో నేను సిందుని మాట్లాడుతున్నా !! "
హుస్సేన్ భాయికి అప్పుడే ఏదో తేడాగా ఉంది అని అనిపించింది.
" ఎవరు ?? సిందు నా ? "
" అవును , నేను సిందునే మాట్లాడుతున్నా. "
" నా నెంబర్ ఎలా తెలిసింది ? "
" మీ ఇంట్లో అడిగి తెలుసుకున్నా " (హరిగాడి సమయస్పూర్తి ఇది. సిందు పక్కింటిలోనే ఉంటుంది అని భాయి కక్కాడు.. అదే చెప్పాడు)
భాయికి నమ్మకం కలగక పోయినా , ఏదో మూల చిన్న ఆనందం వేసింది.
" సరే .. మరి .. మరీ .. మరీ .. ఆప్ .. "
జీవితంలో అమ్మాయితో మాట్లాడి ఎరుగని భాయికి ఏకంగా ఒక అమ్మాయి ఫోన్ చేసింది అంటే ఈ మాత్రం మాటలు రావడం కూడా ఎక్కువే !!!
హరిగాడు .. 'హరిగత్తె' లా "ఎలా ఉన్నావ్ హుస్సేన్ ? "
" ఆ నేను బాగానే ఉన్నా .. నువ్వు ఎలా ఉన్నావ్ ?"
" నేను కూడా బాగానే ఉన్నా. మా ఫ్రెండ్స్ కొంత మంది బెంగుళూరుకి వచ్చారు. IIScని చూద్దాం అని అన్నారు. నాకు నువ్వు తప్ప అక్కడ ఎవరూ తెలియదు .. నాకు , మా ఫ్రెండ్స్ కి IISc చూపిస్తావా? "
" ఖచితంగా !!!" . కాని భాయి కి ఇంకా అనుమానం తీర లేదు. ఎవరికీ చెప్పని విషయం ఒకటి అడిగి చూదాం అని .. " ఇంతకీ బెంగుళూరు లో ఎక్కడ ఉంటున్నావ్ ?"
హరిగాడికి ఈ విషయం తెలియదు . సరే ఓ రాయి వేద్దాం అని "ఆం .. హుం .. ఆం .. మారత్ హళ్లి లో .. " అన్నాడు. మా అదృష్టవశాత్తు, భాయి 'దుర-అదృష్టవశాత్తు' ఆ అమ్మాయి మారత్ హళ్లి లోనే ఉంటుంది.
అనుమానం పూర్తిగా తీరిపోయిన భాయి ఇక మాంచి రొమాన్స్ మూడ్ లోకి వచ్చేసాడు.
"ఓ .. ఓ .. సరే సరే .. .." అని కొద్ది సేపు భాయి అలా పైకి చూస్తూ ఏదో ఆలోచించడం మొదలెట్టాడు.
ఓ పావు గంట తరువాత , ఏదో గుర్తుకు వచ్చినట్టు "ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు ? " అన్నాడు.
ఇంతలో హరిగాడికి భాయి నమ్మేసాడు అన్న ఆనందంలో నవ్వు ఆగట్లేదు. ఫోన్ కట్ చేశాడు. వెంటనే మాలో కొందరం ఓ పంది మూక బురద కాలవలో దొర్లి నట్టు కింద పడి దొర్లి దొర్లి నవ్వడం మొదలెట్టాం. మిగతావాళ్ళు బల్లిలా గోడ కి అత్తుక్కు పోయి నవ్వుతున్నారు. నేల మీద ఉన్నవాళ్లు గోడ మీదకి , గోడ మీద ఉన్నవాళ్లు నేల మీదకి చిన్నగా నవ్వుతూ మారాము. ఈ లోపు హాస్టల్లో ఉన్న వాళ్ళు , మా భీకరమయిన శబ్దాలని విని, ఏ బందిపోటో , టెరరిస్టో వచ్చాడేమో అని అందరూ కంగారు కంగారుగా వచ్చారు. మా నవ్వులు చూసి, పాపం కోర్సు ఒత్తిడి తాళలేక ఇలా మతి తప్పి ఉండొచ్చులే అనుకుని ,వెళ్ళిపోయారు.
ఒక వేల మా నవ్వులు వినిపించి ఉంటాయేమో అని .. హరిగాడు అనుమానంగా మళ్ళి ఫోన్ చేశాడు ..
హుస్సేన్ భాయి: " ఆ చెప్పు సిందు "
హరిగాడు : (అనుమానం తీరింది ..) " హా .. మరి .. ఇంకేంటి ? "
"చెప్పాలి నువ్వే "
"(పూర్తి నిశబ్దం) .. ?? .. " (హరిగాడికి ఏమనాలో తెలియలా)
ఈ లోపు భాయి మనసులో ఓ చిన్న తీన్ మార్ వేసుకుంటున్నాడు. ఇన్ని రోజులుగా బెంగుళూరులో ఉంటూనే ఎప్పుడూ ఓ మాటా మంచి లేదు .. అనుకుంటూ ..అన్నింటి కంటే ముఖ్యంగా ఒక అమ్మాయి తనకి ఫోన్ చేసింది అన్న విషయాన్ని నమ్మలేక పోతూ " అవును .. సిందూ ..
..
..
All of a sudden ... ఎందుకిలా ?? " అన్నాడు భాయి.

ఇక వల్లకాక హరిగాడు .. మళ్ళి దొర్లడం మొదలెట్టాడు. ఫోన్ కట్ చేసేసాము.
------------------------------


మేము అందరం మెస్సు లో కూర్చుని ఉన్నాం. మా అందరిని చూస్తూ .. హుస్సేన్ భాయి .. కొంచం సిగ్గు పడుతూ , తన పళ్ళెం తీసుకుని వచ్చాడు. మేము ఏదో మాట్లాడటం మొదలెట్టాం. హుస్సేన్ భాయి మధ్యలో వచ్చి " ఆ పనిని అలా చెయ్యకూడదు రా .. " అన్నాడు.
నేను భాయి ని చూసి .. "అవును భాయి ..
.
.
All of a Sudden .. ఎందుకిలా?" అన్నాను
----------------------------------------------

Thursday, April 15, 2010

మెసేజ్ తెచ్చిన ముప్పు - part 2

మెసేజ్ తెచ్చిన ముప్పు -- Part 1

కి ఇది రెండో భాగం అని గమనించ గలరు . కధ ముందు నుంచి తెలుసుకోవాలంటే అది చదవండి .

కధ లో ని పాత్రలని ఒక సారి గమనిద్దాం :
రమణ - అసలీ మెసేజ్ idea వాడిదే.
మహేష్ - ఓ అభాగ్యుడు
ప్రసాద్ - మహేష్ మీద మెసేజ్ idea ని పెట్టమని సలహా ఇచ్చిన వాడు . ఓ కంత్రి .
బన్నీ - మహేష్ గాడికి వీడు బాగా సన్నిహితుడు
బాబు - మన కొత్త పాత్ర .

------------------------------
ఫ్లాష్ బ్యాక్
------------------------------
మహేష్, ప్రసాద్ రూం లో ఉన్నారు. ఈ కధ లో కొత్త పాత్ర "బాబు". బాబు, అంటే ఏదో చిన్న బాబు అనుకునేరు, వీడు నలుగురు పిల్లలకి బాబు లా ఉంటాడు. వీడికి కేవలం పెళ్ళికాలేదు అన్న ఒకే ఒక్క కారణానికి, భారత దేశం లో ఇంకా జనాభా లెక్కలు అదుపులో ఉన్నాయి. ఎవడో మొంగోలియా దేశం రాజు చెంఘీస్ ఖాన్ లాగా , ఆసియా అంతా వీడి నిషాని వెయ్యాలని ఆశ , వీడిది. (మీకు తెలుసో లేదో అప్పట్లో మొత్తం ఆసియా జనాబా లో , ప్రతి నలుగురి లో ఒకరు ఆ రాజు సంతానమే అట !! )

బాబు అలవాటు తప్పి , నాలుగో రోజుకే స్నానం చేసి (అసలు లెక్క వారం లెండి) ప్రసాద్ రూం కి తల తల మెరిసిపోతూ వెళ్ళాడు.
ప్రసాద్ వెలిగిపోతున్న బాబు ని చూసి కొంటె గా "నీ చర్మ సౌందర్యానికి కారణం LUX ఆ ? " అన్నాడు . బాబు ఏదో అనబోయే లోపలే మహేష్ వీర ఆవేశం తో " వీడు బోకుబిచ్చ వడతాడేమో రా " అని అన్నాడు ఏదో ఎగతాళి చేద్దామని .

బాబు , ప్రసాద్ , ఒకరి వైపు ఒకరు తెల్లబోయిన మొహాలేసుకుని చూసుకున్నారు.
షాక్ నుంచి తేరుకుంటూ ప్రసాద్ "ఏంటది .. బోకు ?? " అన్నాడు.
మహేష్ : " ఏంటి ?? నీకు బోకుబిచ్చ అంటే తెలియదా ?????"

మహేష్ బాబు వైపు చూసి , "వీడికి బోకుబిచ్చ అంటే తెలియదు అంట రా !!! " ,
దీనంగా చూస్తూ "అదేంటో నాకు తెలియదు రా !! " అన్నాడు బాబు ఏదో తప్పు చేసినట్టు !

మహేష్ : "ఏంటి ? నీకూ బోకుబిచ్చ అంటే తెలియదా ?? "

దేశం లో జనాలకి general knowledge ఇంత తక్కువగా ఉంటుందా అని నమ్మలేక పోయాడు మహేష్. ఆ ఆశ్చర్యం తో (చాదస్తం కొద్ది ) ఇంకో సారి " మీకు బోకుబిచ్చ అంటే తెలియదా ? " అన్నాడు.

(బోకుబిచ్చ అంటే ఏంటో తెలుసు కోవాలంటే , ఇంకొద్ది సేపు ఆగండి.. )

------------------------------
ప్రస్తుతం
------------------------------


రమణ ఆవేశం గా మహేష్, బన్నీల వైపు పరిగెత్తు కుంటూ వెళ్ళాడు .
మహేష్ ని చూసి "నీకు మెసేజ్ ఏమయినా వచ్చిందా ? " అని అడిగాడు ..

మహేష్ "అవును వచ్చింది .." అని తన సెల్లో ఫోన్ లోకి చూశాడు ..
"hutch" నుంచి మెసేజ్ వచ్చినట్టు ఉంది .. మహేష్ కి ఆ మెసేజ్ చూసినప్పటి నుంచే ఏదో చిరాకు గానే ఉంది.
రమణ అలవాటై పోయిన అదే డైలాగ్ ని మళ్ళి వదిలాడు. "ఒరేయ్, నేను పొరపాటున నీ నంబరు కి రీచార్జ్ చేయించాను రా .. నా డబ్బులేవో నాకు ఇచ్చేయి రా " అన్నాడు
మహేష్ కి చిరాకు ఇంకా పెరిగి "అయిన నీకు నా నంబరు తో పని ఏంట్రా, నేను ఇవ్వను పో ! " అన్నాడు, మనసులో తన కక్క్రుతి ని వెలిబుచ్చుతూ.
వీడికి కక్కుర్తే కాదు అనుమానం కూడా. వెంటనే *111# కొట్టి చూశాడు. బాలన్సు అయితే వచ్చిన సూచన లేదు.
రమణ కప్పిపుచ్చుతూ "చిన్నగా వస్తుంది లే రా ... నన్ను కరుణించు రా, నా దగ్గర ఇప్పుడు రీచార్జ్ చేసుకోడానికి కూడా డబ్బులు లేవు, ఇంటికి ఫోన్ చెయ్యాలి రా " అని నంది అవార్డు వచ్చే లాగా ఓవర్ యాక్టింగ్ చేసేసాడు.
మహేష్ కరిగి , "సరే రా , బాలన్సు రాగానే నీ డబ్బులు నీకు ఇస్తా " అన్నాడు.
బుట్టలో పడ్డాడు , అని పక్కన ఉన్న బన్నీ , రమణ లు , మనసులో చంకలు గుద్దుకున్నారు.
అసలు రమణ కి డబ్బులు అవసరం లేదు. వెంటపడి, వేదించి సరదాపాడమని , ఈ idea వేసాడు.
ఇహ , మహేష్ ఎక్కడ కనిపిస్తే అక్కడ hutch కుక్క లా వెంటపడటం మొదలెట్టాడు కూడా.
మహేష్ వీడి బాధ వదిలించు కోవాలి అని నిశ్చయించుకున్నాడు (లేక పోతే డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది అని భయం కూడా)
ఓ వారం పాటు మహేష్ ఎవరికీ కనిపించలేదు. ఓ రోజు రమణ అలా టీ తాగడానికి వెళ్ళాడు. చూస్తే అక్కడ షాప్ వాడితో గొడవ పడుతున్నాడు, మహేష్. రమణ అక్కడున్న క్లీనరు ని విషయం అడిగి కనుక్కున్నాడు.
సంగతేమిటంటే , మహేష్ ఓ వారం పాటు అదే షాప్ లో ఉన్నాడుట. రోజు షాప్ తెరవక ముందే వెళ్లి , షాప్ కట్టేసిన తరువాత వరకు (అంటే overtime పని అన్నమాట ) రోజూ తన నెంబర్ కోసం రీచార్జ్ చేసే పుస్తకం లో వెతుకుతూ షాప్ వాడిని బహు ఇబ్బంది పెడుతున్నాడుట. ఇంతకి గొడవ దేనికి అంటే .. షాప్ వాడితో night duty చెయ్యడానికి కూడా వస్తా అంటున్నాడుట , షాప్ వాడు "బేడ బేడ * " అని కన్నడం లో ఎంత మొత్తుకున్నా కూడా !
విషయం తెలిసిన ప్రసాద్, బాబు, తదితరులు అనుకున్న ప్లాన్ భారి గా విజయవంతం అవ్వడం తో ఆనందం తో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. కాని కధ కు ముగింపు ఎలా ఇవ్వాలో ఎవరికీ అర్ధం అవ్వలేదు. చూదాం లే అనుకున్నారు అందరూ.
మరుసటి రోజు, బాబు తన collection ని విస్తృతం చేసే పని లో , సిల్కు స్మిత - షకీలా పాటలు, సినిమాల CDలు, సంభోగం తో సమాధి పుస్తకం జాగ్రతగా తీసుకుని వెళ్తున్నాడు. దారిలో మహేష్ షాప్ కి "duty" కి వెళ్తూ కనిపించాడు. మన బాబు , షకీలా నడుము కంటే విశాలమయిన హృదయం ఉన్న వాడు కాబట్టి, మహేష్ మీద జాలి పడి , విషయం చెప్పేసాడు.
అసలు ప్రసాద్, రమణ లని వదిలేసి, మహేష్ కి బన్నీ మీద కోపం వచ్చింది, నేరు గా బన్నీ గాడి రూం కి వెళ్ళాడు, వాడిని చితక బాదెయ్యడానికి.
బన్నీ బయట నుంచి మహేష్ రావడం చూసి , వాడి హావభావాల్లో ఏదో తేడా ఉంది అని, బయటకి వెళ్లి ఓ మూల దాక్కొన్నాడు . మహేష్ బన్నీ రూం కి తాళం వేసి "ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడు , చచ్చినట్టు నా దగ్గరకే వస్తాడు. వచ్చినా కూడా చస్తాడు !!" అని వెళ్ళిపోయాడు.
ఇది ఎక్కడి న్యాయం అనుకోని, ప్రసాదే శరణమని వాడి దగ్గరకు వెళ్ళాడు బన్నీ. ప్రసాద్ మహేష్ కి ఫోన్ చేశాడు. "బన్నీ కి ఏమి తెలియదు రా, నేను, రమణ అసలు ప్లాన్ వేసింది." అన్నాడు. "మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, బన్నీ గాడు నా చేతిలో చచ్చాడే, మిత్ర ద్రోహి !! " అన్నాడు మహేష్.
వీడు ఇలా అయితే మాట వినడు , అని ప్రసాద్ తన
రూం లో నుంచి తాళం పట్టుకుని మహేష్ రూం కి వెళ్ళాడు, బన్నీ ని వెంట పెట్టుకుని. అదృష్టవశాత్తు మహేష్ రూం లో లేడు. మహేష్ రూం కి తాళం వేసేసి , వీళ్ళు ఇద్దరు శుబ్రంగా ప్రసాద్ రూం లో రెస్టు తీసుకోవడానికి వెళ్లారు. తాళం చూడగానే , మహేష్ కి విషయం అర్ధం అయ్యింది . మహేష్ కి ఓటమి తప్పలేదు. అంగీకార చిహ్నంగా ప్రసాద్ కి ఫోన్ చేసి, రూం తాళం అడిగాడు. కాని, బన్నీ తో ఇహ మాట్లాడటం మానేశాడు.
దీంతో కధ ఇలా ముగిసింది, భలే అని అందరు(మహేష్ తప్ప) అనుకుని , పేరు పేరున తోటి వాళ్ళకి ఈ విషయం చెప్పుకున్నారు, చవితి కి వినాయకుడి కధ చెప్పుకున్నట్టు.
ఓ రోజు , ఇలా ప్రసాద్ , బన్నీ , రమణలు టీ తాగడానికి వెళ్లారు. అక్కడ షాప్ వాడితో, మహేష్ మళ్ళి గొడవ పడుతూ కనిపించాడు.
మహేష్ : " నాకు బాలన్సు రావాలి , అప్పుడే నీకు డబ్బు !!"
షాప్ వాడు : " రీచార్జ్ మాడ్తిని, దుడ్డు కొడి , ప్లీజ్ !!"
మహేష్ : " నేను బాలన్సు వచ్చినంత వరకు కదిలే ప్రసక్తే లేదు. నీ దుడ్డు కూడా ఇచ్చేది అప్పుడే !! "
మెసేజ్ ని నమ్మకూడదని మహేష్ ఇలా నేర్చుకోవలసి వచ్చింది.
అసలు "బోకుబిచ్చ" అంటే .. ఊళ్లలో గేదెలకు చర్మ సౌందర్యం కోసం వాడే సబ్బు అంట. ఇంత general knowledge ఉన్న మహేష్ ని చూస్తే , " పడ్డ వాళ్ళు GK లేని వాళ్ళు కాదు " అని సమేత చెప్పుకో వచ్చండోయి !!

*బేడ -- వద్దు

Thursday, March 25, 2010

మెసేజ్ తెచ్చిన ముప్పు -- Part 1

అవి నేను M.E. చదువుతున్న రోజులు. రమణ , మహేష్ కళ్యాన్టెష్, బన్నీ , ప్రసాద్ ఈ కధ లోని పాత్రలు.

రమణ ఓ రోజు పని పాటా ఏమి లేక పోవడం తో (కేవలం ఆ ఒక్క రోజే పని లేదు అనుకున్నారంటే మీరు పప్పు లో కాలేసారు ).. ఏం చెయ్యలా అని ఆలోచిస్తూ అలా ప్రసాద్ రూం కి వెళ్ళాడు. రూం లోకి వెళ్ళగానే .. బోరింగ్ మెషిన్ శబ్దం వినిపించి కొంచం ఉక్కిరి బిక్కిరి అయ్యాడు .. ఏమిట్రా అని చూడబోతే ప్రసాద్ నిద్రలో ఉన్నాడు. (విషయం ఏమిటంటే ప్రసాద్ కి గురక ముందు వచ్చి తరువాతే నిద్ర పడుతుంది .. ..)
ఇహ చేసేదేమీ లేక ప్రసాద్ ఫోన్ తో సరదాగా ఆట మొదలెట్టాడు రమణ . ఏమయ్యిందో కాని ఈ పని లేని మంగలోడి బుర్ర లో ఓ వినుత్నమయిన idea తట్టింది . . (బహుశా .. బోరింగ్ మెషిన్ ప్రభావం అయ్యి ఉంటుంది! )

ప్రసాద్ ఫోన్ నుంచి బన్నీ అనే పేరు ని .. 'hutch' గా మార్చాడు ..వెళ్లి బన్నీ ఫోన్ ని 'చిన్న పని ఉంది రా' అని తీసుకుని , ఓ మెసేజ్ ఇలా పంపాడు (ప్రసాద్ కి )..

"మీ నంబరు కి Rs. 200 రీచార్జ్ చెయ్యబడింది .. దయచేసి 'hutch' డీలర్కు Rs.200 చెల్లించగలరు. "

ప్రసాద్ రూం కి వెళ్లి .. (అతి కష్టం మీద ) నిద్ర లేపి .. "ఒరేయ్ .. నేను పొరపాటున నీ నంబరు కి .. రీచార్జ్ చేయించాను .. నీ దానిలో డబ్బు పడి ఉంటుంది .. ...కావాలంటే నీకు వచ్చిన మెస్సేజి చూడు .. నా రెండు వందలు ఏవో నాకు ఇచేయి రా! " అన్నాడు ..

ప్రసాద్ మెసేజ్ చూశాడు .. చూస్తే "hutch" నుంచి మెసేజ్ వచ్చినట్టు ఉంది .. (అది బన్ని ఫోన్ నుంచి పంపిన మెసేజ్)

చిన్న నవ్వు నవ్వి .. రమణ వైపు కొంటె చూపులు చూస్తూ ..
"అంతా బానే చేసావ్ రా ... కాని అస్సలు విషయం మరిచావు .. " అన్నాడు ప్రసాద్ ..
..
..
రమణ "అవును నా రెండు వందలే కదా .. ఇచ్చేయి .. " అన్నాడు , మనసులో ఏదో మూల వీడికి తెలిసిపోయింది అనే సందేహం ఉన్న కూడా..
ప్రసాద్ ఇహ నవ్వడం మొదలెట్టాడు .. (వెధవది గురక ఎంత చెండాలంగా ఉన్న .. నవ్వు బానే ఏడుస్తుంది లెండి. )

"ఏం మర్చిపోయవో ఇప్పటికయినా తెలిసిందా .. ??" అని అడిగాడు ..ప్రసాద్..
ప్రసాద్ గాడి 'confidence' చూసి .. ఇహ తప్పక "మావా నువ్వు కేక రా .. నువ్వు పొలికేక .. ఏం మరిచాను రా .. అంతా పగడ్బందీ గానే చేశా కదా .. .. " అని ఓటమి ఒప్పుకున్నాడు రమణ..

ప్రసాద్ ..
"నాది Airtel రా !!! " అన్నాడు ..

రమణ నిరుత్సాహ పడేలోపల మన కొంటె ప్రసాద్ ఈ బ్రహ్మాండమయిన idea వృధా అవ్వకూడదు అని నిశ్చయించుకుని .. రమణ ని తోడు దొంగ గా నియమించాడు ..

ఇంతకి ఎవరి మీద ప్రయోగించాలి అని అనుకోబోయే లోపలే .. ప్రసాద్ ఈ పనికి తగిన నెమ్మదస్తుడు , తెలివయిన వాడు , ఓపిక కలవాడు , తగిన " దుర " అదృష్టం ఉన్న వాడు .. "ఒక్కడున్నాడు " అని అన్నాడు . రమణకి చటుక్కున అర్ధం అయ్యింది. రమణ మనసులో "నీకు బోకుబిచ్చ అంటే తెలియదా ?" అనే శబ్దాలు echo అయ్యాయి. (అమ్మ తోడు ఇది బూతు కాదు . "బోకు బిచ్చ" గురించి మీకు త్వరలో తెలుస్తుంది )
రమణ , ప్రసాద్ ఇద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుని , ఒకే సారి గట్టిగా .. "మహేష్!!!!" అని నవుతూ అరిచారు .

మహేష్ ఫోన్ లో బన్నీ పేరు ని "Hutch" గా మార్చమని , ఏకంగా బన్నీ నే అడిగారు వీళ్ళు ఇద్దరు.
ఈ జీవితానికి ఇది చాలు అని అనుకుని బన్నీ మహేష్ ని కలవడానికి వెళ్ళాడు.
మహేష్ ఎటో బయల్దేరుతుంటే ..బన్నీ కలిసి 'నే కూడా వస్తా' అన్నాడు .
ఎవడో చిన్న బూకంపం వచ్చినట్టు తుమ్మాడు . మన బన్నీ ఏదో తమాషకి .. "ఇదేమి అపశకునం" అన్నాడు ..
మహేష్ దోరగా చూసి (వాడి చూపే అంత లెండి!! )..
కొంచం చిరాకు గా "ఇవన్నీ 21st century కి వర్తించవు రా . ఎప్పుడు బాగు పడతారు రా మీరు .." అన్నాడు ..
"అపశకునం నాకు కాదు " అన్నాడు బన్నీ సూచనప్రాయంగా !!
మహేష్ బన్నీ వైపు "సిల్లీ ఫెలో లేక పోతే నాకా!!" అన్నట్టు ఓ "లుక్" పడేశాడు ..
ఈ లోపు మన బన్నీ మహేష్ చేతిలో ఫోన్ తీసుకుని ఎంతో చాకచక్యంగా తన పేరుని "Hutch" గా మార్చి , ఈ తిరుగులేని కధ లో తన పాత్రను సరిగ్గా పోషించాను అన్న ఆనందంతో రెండు ఆనంద భాష్పాలు రాల్చాడు.

బన్నీ ఫోన్ ప్రసాద్ దగ్గర ఉండడం తో , సరియిన సమయానికి ప్రసాద్ మెసేజ్ కూడా పంపాడు ..

ఆ పాడు మెసేజ్ రానే వచ్చింది. బన్నీ మహేష్ కి ఫోన్ ఇచ్చి , "మెసేజ్ కాబోలు" అన్నాడు ఏదో తెలియనట్టే ..

ఒకడికి పోయేకాలం ఎంత వేగంగా రాగలదో రమణ అంత ఆవేశంగా పరిగెత్తుకుంటూ వీళ్ళ ఇద్దరి దగ్గరకి వచ్చాడు ..
మహేష్ ని చూసి "నీకు
.
.
(wait for it)
.
.
మెసేజ్ ఏమయినా వచ్చిందా ??" అని అడిగాడు ..

......TO BE CONTD.