Monday, August 30, 2010

'ఎందుకిలా' నా ఖర్మ కాలిపోయింది ?

ఈ కధని అందించిన సుసు బాబు కి , సత్తి బాబుకి నా ధన్యవాదాలు. కధ లో .. 'నేను' మా సత్తి .
----------------------------

హరిగాడు ,నేనూ అప్పుడే రూంలోకి వెళ్లి , రిలాక్ష్ అవుతున్నాం. మా లంబుగాడు రూంకి వచ్చి, "నేను కొత్త నెంబర్ తీసుకున్నా!!! మీ ఫోన్ లో ఫీడ్ చేసుకోండి" అన్నాడు . వెంకటేష్ ప్రసాద్ సెంచరి, సహారాలో వరదలు, ఇలాంటి 'అవకాశాలు' చాలా అరుదుగా వస్తాయి. దీన్ని వదిలే ప్రసక్తే లేదు. అమ్మాయి లా మాట్లాడి ఎవరినన్నా 'బక్రా' చేయొచ్చని అనుకున్నాం. దీనిలో హరిగాడు దిట్ట.
అయితే , తన పరపతిని తిరుపతిలో చాటి చెప్పుకోవడానికి వెళ్లి తిరిగి వస్తున్నాడు, మా హుస్సేన్ భాయి .
"హుస్సేన్ భాయి తిరుపతి నుంచి వస్తున్నాడురా..దారిలో ఉన్నాడు" అని అన్నాను హరిగాడితో .
"అయితే భాయికే ఫోన్ చేద్దాం ..సిందు అని చెబుదాం" అన్నాడు హరి.

అప్పుడో సారి సిందు అనే అమ్మాయి గురించి ఏవో నాలుగు ముక్కలు కక్కాడు మా హుస్సేన్ భాయి. సరిగా హరిగాడికే చెప్పకూడదని, పాపం భాయి మాత్రం కల కన్నాడా? ..

ఇంకేముంది, హరిగాడు వెంటనే హుస్సేన్ భాయికి ఫోన్ చేసి , స్పీకర్ ఆన్ చేశాడు.

హరిగాడు (అమ్మాయి గొంతులో )
" హలో .. "
హుస్సేన్ భాయి : " హలో ఎవరు ?"
"హలో , నేను హరి చిచి సిందుని మాట్లాడుతున్నా!!! "
" హలో ఎవరు ?? " (హుస్సేన్ భాయి కి సరిగ్గా వినపడాల్సిన విషయం వినపడలేదు పాపం.)
"హలో నేను సిందుని మాట్లాడుతున్నా !! "
హుస్సేన్ భాయికి అప్పుడే ఏదో తేడాగా ఉంది అని అనిపించింది.
" ఎవరు ?? సిందు నా ? "
" అవును , నేను సిందునే మాట్లాడుతున్నా. "
" నా నెంబర్ ఎలా తెలిసింది ? "
" మీ ఇంట్లో అడిగి తెలుసుకున్నా " (హరిగాడి సమయస్పూర్తి ఇది. సిందు పక్కింటిలోనే ఉంటుంది అని భాయి కక్కాడు.. అదే చెప్పాడు)
భాయికి నమ్మకం కలగక పోయినా , ఏదో మూల చిన్న ఆనందం వేసింది.
" సరే .. మరి .. మరీ .. మరీ .. ఆప్ .. "
జీవితంలో అమ్మాయితో మాట్లాడి ఎరుగని భాయికి ఏకంగా ఒక అమ్మాయి ఫోన్ చేసింది అంటే ఈ మాత్రం మాటలు రావడం కూడా ఎక్కువే !!!
హరిగాడు .. 'హరిగత్తె' లా "ఎలా ఉన్నావ్ హుస్సేన్ ? "
" నేను బాగానే ఉన్నా .. నువ్వు ఎలా ఉన్నావ్ ?"
" నేను కూడా బాగానే ఉన్నా. మా ఫ్రెండ్స్ కొంత మంది బెంగుళూరుకి వచ్చారు. IIScని చూద్దాం అని అన్నారు. నాకు నువ్వు తప్ప అక్కడ ఎవరూ తెలియదు .. నాకు , మా ఫ్రెండ్స్ కి IISc చూపిస్తావా? "
" ఖచితంగా !!!" . కాని భాయి కి ఇంకా అనుమానం తీర లేదు. ఎవరికీ చెప్పని విషయం ఒకటి అడిగి చూదాం అని .. " ఇంతకీ బెంగుళూరు లో ఎక్కడ ఉంటున్నావ్ ?"
హరిగాడికి విషయం తెలియదు . సరే రాయి వేద్దాం అని "ఆం .. హుం .. ఆం .. మారత్ హళ్లి లో .. " అన్నాడు. మా అదృష్టవశాత్తు, భాయి 'దుర-అదృష్టవశాత్తు' అమ్మాయి మారత్ హళ్లి లోనే ఉంటుంది.
అనుమానం పూర్తిగా తీరిపోయిన భాయి ఇక మాంచి రొమాన్స్ మూడ్ లోకి వచ్చేసాడు.
" .. .. సరే సరే .. .." అని కొద్ది సేపు భాయి అలా పైకి చూస్తూ ఏదో ఆలోచించడం మొదలెట్టాడు.
ఓ పావు గంట తరువాత , ఏదో గుర్తుకు వచ్చినట్టు "ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు ? " అన్నాడు.
ఇంతలో హరిగాడికి భాయి నమ్మేసాడు అన్న ఆనందంలో నవ్వు ఆగట్లేదు. ఫోన్ కట్ చేశాడు. వెంటనే మాలో కొందరం పంది మూక బురద కాలవలో దొర్లి నట్టు కింద పడి దొర్లి దొర్లి నవ్వడం మొదలెట్టాం. మిగతావాళ్ళు బల్లిలా గోడ కి అత్తుక్కు పోయి నవ్వుతున్నారు. నేల మీద ఉన్నవాళ్లు గోడ మీదకి , గోడ మీద ఉన్నవాళ్లు నేల మీదకి చిన్నగా నవ్వుతూ మారాము. లోపు హాస్టల్లో ఉన్న వాళ్ళు , మా భీకరమయిన శబ్దాలని విని, బందిపోటో , టెరరిస్టో వచ్చాడేమో అని అందరూ కంగారు కంగారుగా వచ్చారు. మా నవ్వులు చూసి, పాపం కోర్సు ఒత్తిడి తాళలేక ఇలా మతి తప్పి ఉండొచ్చులే అనుకుని ,వెళ్ళిపోయారు.
ఒక వేల మా నవ్వులు వినిపించి ఉంటాయేమో అని .. హరిగాడు అనుమానంగా మళ్ళి ఫోన్ చేశాడు ..
హుస్సేన్ భాయి: " చెప్పు సిందు "
హరిగాడు : (అనుమానం తీరింది ..) " హా .. మరి .. ఇంకేంటి ? "
"చెప్పాలి నువ్వే "
"(పూర్తి నిశబ్దం) .. ?? .. " (హరిగాడికి ఏమనాలో తెలియలా)
లోపు భాయి మనసులో చిన్న తీన్ మార్ వేసుకుంటున్నాడు. ఇన్ని రోజులుగా బెంగుళూరులో ఉంటూనే ఎప్పుడూ మాటా మంచి లేదు .. అనుకుంటూ ..అన్నింటి కంటే ముఖ్యంగా ఒక అమ్మాయి తనకి ఫోన్ చేసింది అన్న విషయాన్ని నమ్మలేక పోతూ " అవును .. సిందూ ..
..
..
All of a sudden ... ఎందుకిలా ?? " అన్నాడు భాయి.

ఇక వల్లకాక హరిగాడు .. మళ్ళి దొర్లడం మొదలెట్టాడు. ఫోన్ కట్ చేసేసాము.
------------------------------


మేము అందరం మెస్సు లో కూర్చుని ఉన్నాం. మా అందరిని చూస్తూ .. హుస్సేన్ భాయి .. కొంచం సిగ్గు పడుతూ , తన పళ్ళెం తీసుకుని వచ్చాడు. మేము ఏదో మాట్లాడటం మొదలెట్టాం. హుస్సేన్ భాయి మధ్యలో వచ్చి " పనిని అలా చెయ్యకూడదు రా .. " అన్నాడు.
నేను భాయి ని చూసి .. "అవును భాయి ..
.
.
All of a Sudden .. ఎందుకిలా?" అన్నాను
----------------------------------------------